AP 3282 Professor Posts Recruitment 2023 Notification Update News
Professor Posts: త్వరలో 3,282 అధ్యాపక పోస్టుల భర్తీ!
ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి
రాష్ట్రంలోని 18 విశ్వవిద్యాలయాల్లో 3,282 అధ్యాపక పోస్టుల భర్తీకి అక్టోబరు 20న ప్రకటన వెలువరిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ఆచార్య కె.హేమచంద్రారెడ్డి పేర్కొన్నారు. వీటితో పాటు మరో 70 పోస్టులను డిప్యుటేషన్‌పై తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా నన్నయ విశ్వవిద్యాలయంలో అక్టోబరు 16న ఆయన విలేకరులతో మాట్లాడారు. అధ్యాపక పోస్టుల భర్తీలో భాగంగా ప్రస్తుతం పనిచేస్తున్న అడహాక్ అధ్యాపకులకు పది శాతం మార్కులు వెయిటేజీ ఇవ్వాలని సీఎం నిర్ణయించారని తెలిపారు.
భర్తీ సమయంలో 1:12 మంది వంతున, వారి నుంచి మళ్లీ 1:4 నిష్పత్తిలో ఎంపిక చేస్తారన్నారు. ఈ ప్రక్రియలో సదరు అధ్యాపకుడు అకడమిక్‌గా సాధించిన ప్రగతిని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి సైతం బోధన సిబ్బంది నియామకంలో అనుసరిస్తున్న విధానాన్ని (రేషనలైజేషన్ ప్రక్రియను) అనుసరిస్తామని స్పష్టం చేశారు.
ఏ వర్సిటీకి ఎంతమంది బోధనేతర సిబ్బంది అవసరమో లెక్కించి నివేదిక ఇవ్వడానికి ఉర్దూ విశ్వవిద్యాలయం వీసీ రహమాన్‌తో కమిటీని నియమించామని చెప్పారు. కంప్యూటర్ సైన్స్ చదివే విద్యార్థులకు వర్చువల్ విధానంలో ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాన్ని కల్పించామని వివరించారు.